లాగ్ » లాగింగ్ | |
లాగ్ అనగా జరిగిన విషయములకు సంబంధించి నమోదు చేయబడిన సమాచారము. ఎక్కువగా ఇది ప్రయాణములలో వాడబడుతుంది. అది ప్రయాణమునకు వినియోగించిన వాహనము యెక్క పని తీరును తెలియచేస్తుంది. [ఉదా: విమానాలలో ఉండే డేటా ఫ్లయిట్ రికార్డర్స్ (Black box)]. లాగ్, వాహనము యొక్క వేగము, ప్రయాణము సాగే తీరు మరియు ప్రయాణమునకు సంబంధించిన యితర ముఖ్యమైన విషయములకు సంబంధించిన సమాచారము కలిగి వుంటుంది. సాధారణంగా, ఇటువంటి విషయాలు వ్రాతపూర్వకముగా నమోదుపరచబడిన పుస్తకమును లాగ్ అంటారు. సాంప్రదాయబద్దంగా లాగ్‌ను చేవ్రాలుతో తయారు చేసేవారు. ఆధునిక యుగంలో అదే పనిని యాంత్రికంగా చేయటానికి కంప్యూటర్స్ దోహదపడుతున్నాయి. • లాగింగ్లాగ్లో సమాచారాన్ని నమోదుచేసే ప్రక్రియను లాగింగ్ అంటాము. • కంప్యూటర్‌లోకి లాగిన్ అవడంకంప్యూటర్ తెర మీద వినియోగ నామము (యూజర్ నేమ్), ప్రవేశ పదము (పాస్ వోర్డ్) నమోదు చేయటం ద్వారా కంప్యూటర్‌ను ఉపయోగించడం మొదలు పెట్టినప్పుడు, ఆ వినియోగ నామము కలిగిన వ్యక్తి కంప్యూటర్‌లోకి లాగిన్ అయినట్లు. ఈ పనిని లాగిన్ అని పిలవడానికి కారణం, ఆ క్షణం నుండి ఆ కంప్యూటర్ వాడకాన్ని ఆ వ్యక్తి చేపట్టిన ఒక ప్రయాణముగా కంప్యూటర్ పరిగణించడమే. కంప్యూటర్ ఆ వ్యక్తి యొక్క కంప్యూటర్ వాడకమునకు సంబంధించిన అనేక అంశములను అతని వినియోగనామముతో అనుసంధించబడిన ఒక ఫైల్‌లో నమోదు చేస్తుంది. దానినే లాగ్ ఫైల్ అంటారు. కంప్యూటర్ లాగ్ ఫైలులో సమాచారాన్ని నమోదు చెయ్యడం, ఒక వాహన ప్రయాణమునకు సంబంధించిన విషయములను నమోదు చేయటం లాంటిదే. కంప్యూటరే ఇక్కడ వాహనము, దానిని వినియోగించడమే ప్రయాణం |
వినియోగ నామము » ప్రవేశ పదము | |
• వినియోగ నామము (User Name) కంప్యూటర్ లాంటి ఎలక్ట్రానిక్ సాధనాలను వినియోగించే వారు, ఆ సాధనం వద్ద వారి గుర్తింపుగా ఒకటి అంతకంటే ఎక్కువ పదములతో కూర్చిన పదబంధాన్ని వాడతారు. దీనినే వినియోగనామము అంటారు. కంప్యూటర్ తెర మీద ప్రదర్శించబడే గడులలో వినియోగనామమును నింపేటప్పుడు (కుంచికలు వుపయోగించి ముద్రించేటప్పుడు), తెర కనపడే వారందరికీ అది కనపడుతుంది. • ప్రవేశ పదము (Password) సాధారణంగా కంప్యూటర్ల వినియోగములో రక్షణ కొరకు ప్రతి వినియోగనామము, ఒక ప్రవేశ పదంతో జోడించబడి ఉంటుంది. కంప్యూటర్‌ను వినియోగించాలనుకునేవారు, తమ వినియోగ నామము, సంబంధిత ప్రవేశ పదాలను కంప్యూటర్ తెర మీద ప్రదర్శించబడే గడులలో తప్పనిసరిగా నింపవలసి ఉంటుంది. ప్రవేశ పదము గడిలో నింపేటప్పుడు అది తెర మీద వున్నదున్నట్లుగా ప్రదర్శించబడదు. ఆ గడులలో నింపబడే చిహ్నముల/అక్షరముల బదులు *, •, # వంటి చిహ్నాలు మాత్రమే ప్రదర్శించబడతాయి. ప్రవేశ పదము సంబంధిత గడులలో నింపబడేటప్పుడు ప్రక్కన వున్నవారెవరైనా దానిని తెలుసుకునే వీలు లేకుండా వుండుట కొరకు ఈ ఏర్పాటు. వినియోగనామము-ప్రవేశ పదము అనే ఆలోచన చాలా ఎలక్ర్టానిక్ పరికరములలో మనకు తారసపడతాయి. |
బ్లాగ్ » బ్లాగింగ్ » బ్లాగర్ | |
• డైరీ్ మనం మన ఆలోచనలు, దినచర్య లాంటివి నమోదు చేయడానికి వాడే పుస్తకానిని డైరీ అని పిలుస్తాము. • బ్లాగ్ » వెబ్ లాగ్ ఇంటర్నెట్ ద్వారా ఎల్లప్పుడు అందుబాటులో ఉండే ఇటువంటి సమాచారమును కలిగిన వెబ్ పుటను బ్లాగ్ అంటారు. (ఇది మనము ఒక వ్యక్తి ప్రచురించే పత్రిక అని అర్ధం చేసుకోవచ్చు). బ్లాగ్ ఒకరు అంతకంటే ఎక్కువ మంది యొక్క వ్యక్తిగత ఆలోచనలు, అభిప్రాయాలు, వెబ్ పుట రూపంలో ప్రచురించబడి వుండే లాగ్ పుస్తకము లాంటిది. దీనినే వెబ్ లాగ్ అని కూడా అంటారు. [ఇంటర్నెట్‌ను వెబ్ (www-World Wide Web) అని కూడా సంభోధిస్తాము].
బ్లాగ్‌లు తరుచుగా ఆ వెబ్ పుటలను సృష్టించే (వ్రాసే) వారి యొక్క వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంటాయి.
• బ్లాగ్ = డైరీ + లాగ్ డైరీలో వ్యక్తిగత అభిప్రాయాలు, భావాలు నమోదు చేస్తాము. లాగ్‌లో అనుక్షణం జరిగేది నమోదు చేస్తాము. బ్లాగ్, ఈ రెండు లక్షణాలు కలిగి వుంటుంది. అందుకనే బ్లాగ్‌లను క్రమబద్ధంగా వ్రాయడం ద్వారా తాజాగా వుంచే ప్రయత్నం చేస్తారు. బ్లాగ్‌లో పోస్టింగులన్నీ ఇంచుమించు కాలక్రమానుసారంగా ఏర్పరచబడి, సరిక్రొత్తగా చేర్చినటువంటివి ప్రముఖమైనవిగా ప్రాధాన్యత నివ్వబడి వుంటాయి. • బ్లాగింగ్ బ్లాగ్‌లో తాజా సమాచారాన్ని చేర్చడం కొరకు చేసే కార్యకలాపాలను బ్లాగింగ్ అంటారు. ఈ పనిని చేసే వారిని బ్లాగర్ అని సంభోధిస్తాము. • బ్లాగర్ బ్లాగింగ్ కార్యకలాపాలను చేసే వారిని బ్లాగర్ అని సంభోధిస్తాము. • పోస్టింగ్ బ్లాగింగ్ అనేది సాధారణంగా బ్లాగ్‌కు సంబంధించిన అన్ని రకముల పనులను ఉద్దేశించి వాడే పదం. నిర్ధిష్టంగా బ్లాగ్‌లో సమాచారాన్ని చేర్చడం అనే ప్రక్రియను పోస్టింగ్ (Posting) అంటారు. మనం బ్లాగ్‌లో చేర్చే సమాచారం అక్షర పాఠం, ప్రతిమలు/చిత్రాలు/బొమ్మలు, వీడియో, ఆడియో, మొదలైన అనేక రూపాలలో వుండవచ్చు.
|
బ్లాగ్ యొక్క నిర్మాణము Structure | |
ప్రతి బ్లాగ్ ఒక వెబ్ పుట అవుతుంది. ఒకసారి బ్లాగ్‌లో బ్లాగర్ ఏదయినా సమచారాన్ని చేర్చితే, బ్లాగ్‌లో ఒక పోస్ట్ చేయబడినట్లు. ఒక బ్లాగ్ అనేకమైన పోస్టులతో కూడుకొని వుంటుంది. ప్రతి పోస్ట్, బ్లాగ్ అని పిలవబడే వెబ్ పుటలోని ఒక చిన్న భాగం అవుతుంది. సాధారణంగా బ్లాగ్‌లో సరిక్రొత్త పోస్టింగ్‌లు అగ్రభాగాన (అన్నింటికంటే ముందు) కనపడతాయి.
మనం బ్లాగ్‌లో పోస్టింగ్‌లు చేస్తున్న కొద్దీ, బ్లాగ్‌లో అంతర్భాగమయిన పోస్టింగ్‌ల సంఖ్య పెరుగుతూ వుంటుంది. తద్వారా, బ్లాగ్‌గా గుర్తించబడే వెబ్ పుట పరిమాణము పెరుగుతూ ఉంటుంది. వెబ్ పుట పరిమాణం ఎక్కవయిన కొద్దీ అది బ్రౌజర్‌లో లోడ్ (నింపబడటానికి) పట్టే సమయం అధికం అవుతూ వుంటుంది. లోడ్ అవ్వడానికి ఎక్కువ సమయం పట్టే పుటల పట్ల పాఠకుల ఉత్సుకత సన్నగిల్లి పోవడానికి అవకాశం వుంటుంది. ఈ కారణంగా పాత పోస్ట్‌లను ప్రాచీనీకరించడం ద్వారా వాటిని వేరే పుటలలోకి తరలిస్తారు. ఇలా ప్రాచీనీకరించబడ్డ పోస్ట్‌లు బ్లాగ్‌కు అనుబంధంగా వున్న అదనపు పుటల రూపంలో, బ్లాగ్ ముఖ్య పుటకు అనుసంధించబడి పని చేస్తాయి. విలక్షణంగా బ్లాగ్‌లలో సమాచారం రోజూ చేర్చబడుతుంది. బ్లాగ్‌లలో సమాచారం చేర్చడమనే ప్రక్రియ చేపట్టడానికి ప్రత్యేకమయిన సాఫ్ట్‌వేర్ (బ్లాగర్.కామ్ వెబ్‌సైట్‌లో వున్నటువంటిది) ఉపకరిస్తూ ఉంటుంది. ఈ సాఫ్ట్‌వేర్ వలన ఏ మాత్రం సాంకేతిక పరిజ్ఞానం లేని వారు కూడా బ్లాగ్‌లను సృష్ఠించి సమాచారం చేర్చగలుగుతున్నారు. |
బ్లాగ్‌లో వుండేదేంటి? వుపయోగమేంటి? | |
• బ్లాగ్‌లో ఏమి పెట్టవచ్చు? ప్రతి బ్లాగ్ ఒక వెబ్ పుటే. ఆ కారణంగా, మనం వెబ్ పుటలలో ఏమయితే చూస్తామో అవన్నీ బ్లాగ్‌లో కూడా చేర్చవచ్చు/పెట్టుకోవచ్చు. [ఉదా: అక్షర పాఠం, ప్రతిమలు/చిత్రాలు/బొమ్మలు, వీడియో, ఆడియో, మొదలైనవి ]. బ్లాగ్‌లలో విలక్షణమైన సమాచారం మనకు కనపడుతుంది. బ్లాగర్ యొక్క వ్యక్తిగత అభిప్రాయాలు, బయటి ప్రపంచంలో జరిగే వాటికి సంభంధించిన తాజా/ముఖ్య వార్తా శీర్షికలు, బ్లాగర్‌కు యితర వెబ్‌సైట్లలో నచ్చిన వార్తా వ్యాసాంగాలకు సంబంధించిన సమాచారం, బ్లాగర్ యొక్క దినచర్య, ఇతర వెబ్ పుటల (బ్లాగ్‌ల, ఇతర వెబ్ సైట్ల) గురించి బ్లాగర్ యొక్క వ్యాఖ్యానాలు, సిఫార్సులు, వెబ్ లంకెలు, బ్లాగ్‌ను చదివే వారు చేసిన వ్యాఖ్యలు, సిఫార్సులు, కంపెనీలకు/వ్యక్తులకు సంబంధించిన సమాచారం, ఆలోచనలు, భావనలు, ఫోటోలు, చిత్రాలు, పాటలు, కవిత్వాలు, వ్యాసాలు, కల్పిత కధలు ... మీ ఊహే హద్దు. ఏమయినా వుండవచ్చు. • బ్లాగ్‌ను దేనికి వినియోగించవచ్చు? బ్లాగ్‌లకు విభిన్నమైన ప్రయోజనాలు/ఊద్దేశాలు/లక్ష్యాలు వుంటాయి చాలా బ్లాగ్‌లు వ్యక్తిగతమైనవి. నా మదిలో ఏముందంటే, లేక నా ఉద్దేశ్యంలో! లాంటివే. కొన్ని బ్లాగ్‌లు కొంతమంది కలిసి చేసిన ప్రయత్నము నుండి నిర్మించబడటం కనపడుతుంది. ఇవి నిర్ధిష్టమైన అంశముల మీద లేక వారందరికి ఆసక్తి ఉన్న అంశములకు సంబంధించినవి అయి వుండటం చూస్తాము. బ్లాగ్‌లు ఒక జట్టు/విభాగము/కంపెనీ/కుటుంబంలోని సభ్యులు సంపర్కించుడానికి (పరస్పరం సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడానికి) అధ్బుతమైన సాధనాలుగా ఉపయోగపడతాయి. ఇవి చిన్న జట్లు (గ్రూప్స్) సంపర్కించుకోవడానికి/అనుసరించడానికి, ఈ మెయిల్, ఫోరమ్ లాంటి సాధనాల కంటే తేలిక సాధనాలుగా వుపయోగపడతాయి. ఇంట్రానెట్ మీద పనిచేసే ప్రైవేట్ బ్లాగ్‌లను (ఆమోదించబడిన వారి వరకే అందుబాటులో వుండేవి) జట్టులోని సభ్యులు, సంబంధిత రంగంలో వెబ్ పుటలకు లంకెలు, ఫైల్స్, ఉల్లేఖనములు (Quotations), ఉదాహరణలు, వ్యాఖ్యానాలు, వ్యాఖ్యలు, మొదలగు వాటిని పంచుకోవడానికి ఉపయోగించవచ్చు.
కుటుంబ సభ్యులు, చుట్టాలు, కుటుంబ సంబంధిత సమాచారాన్ని పంచుకోవడానికి బ్లాగ్‌లు ఉపయోగపడతాయి. జట్లు ఉపయోగించే బ్లాగ్‌లు సభ్యులందరికి జరుగుతున్న విషయములన్న్నీ తెలియపరచబడుతున్నాయి అని నిర్ధారించుకోవడానికి, సభ్యుల మధ్య సంలగ్నత (Cohesiveness), జట్టు తత్వాన్ని పెంపొందించడానికి ఉపయోగపడతాయి. బ్లాగ్‌లు బయటి వారికి ఒక ప్రాజక్ట్ , విభాగ సభ్యుల యొక్క అనోపకారిక (Informal) వాక్కుగా ఉపయోగపడతాయి. |
బ్లాగింగ్‌కు సంబంధించిన పరిజ్ఞానాన్ని గడించడానికి మనం చేసే ప్రయత్నంలో భాగంగా ముందు ఉండే పుటలలో బ్లాగర్.కామ్, బ్లాగ్‌స్పాట్.కామ్ అనే రెండు వెబ్ సైట్లు ఎదురు పడుతూ వుంటాయి. బ్లాగింగ్ ప్రక్రియలో భాగంగా బ్లాగ్‌కు సంబంధించి రెండు వ్యవహారాలను మనం చేస్తాము. ఒకటి బ్లాగ్ పుటలను సృష్టించడం, రెండు వాటిని ఎల్లప్పుడూ ఇంటర్నెట్‌కి అనుసంధించబడివున్న కంప్యూటర్‌లో నిక్షిప్త పరచడం. మొదటి ప్రక్రియకి (సృష్ఠికి) అవసరమైన సేవలను అందించే వెబ్ సైట్ బ్లాగర్.కామ్, రెండవ ప్రక్రియకి (నిక్షిప్త పరచడానికి) అవసరమైన సేవలను అందించే వెబ్ సైట్ బ్లాగ్‌స్పాట్.కామ్. బ్లాగర్.కామ్ అనే వెబ్‌సైట్‌లో వున్న ఇంటర్నెట్ ఆధారిత ప్రోగ్రామ్ మనం బ్లాగ్ పుటలను సృష్ఠించడానికి ఉపకరిస్తుంది. ఈ ప్రోగ్రామ్‌లో ఉన్న అనేక ఫీచర్స్‌ను మనం బ్లాగర్.కామ్ వెబ్ సైట్ లో ఉన్న అనేక పుటల ద్వారా వినియోగించుకోవచ్చు. బ్లాగర్.కామ్ వెబ్ సైట్‌లో ఉన్న ప్రోగ్రామ్‌ను ఉపయోగించి సృష్ఠించిన బ్లాగ్ పుటలను (వెబ్ పుటలను) బ్లాగ్‌స్పాట్.కామ్ అనే వెబ్ సైట్‌లో పొందుపరుస్తాము. బ్లాగ్‌స్పాట్.కామ్ మన బ్లాగ్ పుటలకు ఉచిత ఆతిధ్య సేవలనందిస్తుంది (Free Hosting Service). మనం బ్లాగ్‌స్పాట్.కామ్ అందించే సేవలను ఉపయోగించుకుంటే మన బ్లాగ్ వెబ్ చిరునామా __బ్లాగ్‌స్పాట్.కామ్ తో అంతమవుతుంది. [Eg: thezing.blogspot.com, Usefulnews.blogspot.com] బ్లాగర్.కామ్, బ్లాగ్‌స్పాట్.కామ్ అధ్బుతమనిపించేటంత సమిష్టిగా పని చేస్తాయి. అవి రెండూ వేరు వేరు వెబ్ సైట్లని మనం స్పృహలో వుండనవసరం లేనంతగా!
మీకు సొంతంగా వెబ్ సైట్ వుంటే మీరు బ్లాగర్.కామ్‌ను ఉపయోగించి సృష్టించుకున్నబ్లాగ్ పుటలకు మీ వెబ్ సైట్ లోనే ఆతిధ్యమివ్వవచ్చు (Host). అంటే బ్లాగ్ పుటలను సృష్టించడానికి మాత్రమే బ్లాగర్.కామ్ ఉచిత ప్రోగ్రామ్ ఉపయోగించుకుంటాము. [వీటి గురించి తదుపరి పుటలలో నేర్చుకుందాము.] బ్లాగర్.కామ్, ప్రోగ్రామ్ పుటలకు ఆతిధ్యమిచ్చే వెబ్ సైట్, బ్లాగ్‌స్పాట్.కామ్, బ్లాగ్ పుటలకు ఆతిధ్యమిచ్చే వెబ్ సైట్. కాబట్టి మీరు మీ బ్లాగ్ పుటలను ఎక్కడ నిక్షిప్తపరచారంటే బ్లాగ్‌స్పాట్.కామ్ అనుకోవాలి, బ్లాగర్.కామ్ కాదు. అయితే మీరు మీ బ్లాగ్‌లో సవరణలు (మార్పులు చేర్పులు) చేయాలంటే మాత్రం బ్లాగర్.కామ్ వెబ్ సైట్‌ను ఉపయోగించాల్సిందే. |
అనువాదం :: నేర్పు జట్టు | ఈ పుటకు ఆంగ్ల మూలం | తరువాతి పుట ౨(2) |