| ముందు పుట ... ౧౪ (14) |
| ఫైళ్ళు : రకాలు | |
• ఫైళ్ళు, ఫైళ్ళు, ఫైళ్ళు ...
మీ కంప్యూటర్‌లో నిక్షిప్తపరచబడ్డ ప్రతీదీ ఒక ఫైలే. మసం కంప్యూటర్‌లో నిక్షిప్తపరచే ప్రతీదీ ఒక ఫైలు రూపంలో భద్రపరచబడుతుంది. వివరణ కొరకు కంప్యూటర్లలో భద్రపరచబడే ఫైళ్ళు మొత్తాన్ని రెండుగా వర్గీకరిస్తాము.
» ప్రోగ్రామ్ ఫైళ్ళు
వాటంతట అవే పనిచేసే లక్షణం కలిగిన ఫైళ్ళు. వీటిలో చాలా సందర్భాలలో వుండేది కంప్యూటర్ అర్ధం చేసుకునే పరిభాషలో వున్న ప్రోగ్రామ్ కోడ్ మాత్రమే.
» దత్త/సమాచార ఫైళ్ళు
ఏదయినా ఒక ప్రోగ్రామ్‌ను వుపయోగించి సృష్టించబడి, ఆ ప్రోగ్రాములలో(తో) లేక దానిని అర్దం చేసుకొగలిగే ఏ యితర ప్రోగ్రాములలో(తో) మాత్రమే పని చేసే లక్షణం కలిగిన ఫైళ్ళు.
|
| ఫైల్ పేర్లు | |
|
కంప్యూటర్ ఫైళ్ళు వాటి పేర్లతో గుర్తించబడతాయి. ఫైల్ పేరు చివర పేరు పొడిగింపు (Name Extension) చేర్చబడి వుంటుంది. (మీ కంప్యూటర్‌లో ఫైల్ పేర్లు ప్రదర్శించబడేటప్పుడు వాటి పేరు పొడిగింపు దాచబడేటట్లు అమర్చబడివున్నట్లయితే, ఇవి కనపడవు). ఫైల్ పేరు దాని పొడిగింపు ఒక విరామ చిహ్నంతో (period/fullstop/dot) వేరు చేయబడివుంటాయి [పేరు .పొడిగంపు]. సాధారణంగా ఫైల్ పేరు పొడిగింపు 3 లేక 4 అక్షరాల నిడివి కలిగివుంటుంది.
ప్రోగ్రామ్ ఫైళ్ళు ".exe" (executable) [పని చేసే లక్షణం కలది], ".com (command)"[అదేశం], లేదా ".bat (batch)" అనే పేరు పొడిగింపులు కలిగివుంటాయి. దత్త/సమాచార (data) ఫైళ్ళ పేరు పొడిగింపు, అవి ఏ ప్రోగ్రామ్ వుపయోగించి తయారు చెయ్యబడ్డాయి అనేదాని మీద ఆధారపడి వుంటుంది. మనకు తరచుగా కనపడే ప్రోగ్రామ్ ఫైళ్ళు ".exe" పేరు పొడిగింపు కలిగివుంటాయి.
• గమనిక
ఈ వివరణలన్నీవిండోస్ వాతావరణానికి సంబంధించినవి
| |||||||||||||||||||||||||||||
| ఫైళ్ళను పనిచేయించడం, సవరించడం, వీక్షించడం/చదవడం | |
• ప్రోగ్రామ్ ఫైళ్ళు పనిచేయించబడతాయి (Executed)
ప్రోగ్రామ్ ఫైళ్ళు స్వతంత్రంగా పని చేసె లక్షణం కలిగి వుంటాయి. కొన్ని సార్లు అవి ఇతర ఫైళ్ళ సహకారంతో పని చేయడం కనపడుతుంది.
ఒక ప్రోగ్రామ్ ఫైలును పనిచేయించడాన్ని సాంకేతిక పరిభాషలో ప్రోగ్రామ్ ఫైల్‌ను ఎక్సిక్యూట్ (Execute) చెయ్యడం అంటాము. సాధారణ పరిభాషలో దీనిని ప్రోగ్రామ్ ఫైలును తెరవడం అంటాము.
మైక్రోసాఫ్ట్ - వోర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, పెయింట్ బ్రష్, మైన్ స్వీపర్ మొదలగు ప్రోగ్రాములు తెరవడం, ప్రోగ్రామ్ ఫైళ్ళను పనిచేయించడానికి ఉదాహరణలు. ప్రోగ్రామ్ ఫైల్స్ సవరించడానికి అవకాశం వుండదు. ఇవి కేవలం వీటిలో వున్న ప్రోగ్రామ్‌ను పనిచేయించడానికి మాత్రమే వుపయోగించాలి. • దత్త/సమాచార ఫైల్స్ సవరించబడతాయి/వీక్షించబడతాయి
సవరించడం, వీక్షించబడతాయి - ఇవి దత్త/సమాచారము కలిగిన ఫైళ్ళతో మనం చేసే పనులు.
» సవరించడం (Editing)
ఫైళ్ళతో సవరించడమంటే వాటిలో వున్న సమాచారంలో మార్పులు, చేర్పులు చేసి ఫైల్‌ను మారిన రూపంలో భద్రపరచడం లేదా సరికొత్త ఫైలును సృష్టించి దానిలో సమాచారాన్ని చేర్చి భద్రపరచడం అని అర్ధం చేసుకోవాలి.
దత్త/సమాచార ఫైళ్ళు సవరించబడే లక్షణం కలిగివుంటాయి (వాటి సవరిణ నిరోధించబడి వుంటే తప్పితే). కొన్ని సమాచార ఫైళ్ళు సవరించడానికి అవకాశం వుండకపోవచ్చు. దీనికి కారణం ఆ ఫైళ్ళను సృష్టించిన వారు దానిని సవరించే అనుమతిని యిచ్చివుండక పోవడం [ఉదా: ఇంటర్నెట్ వాడకందారులు ఎక్కువగా చూసే PDF ఫైళ్ళు], లేదా ఆ ఫైల్ లక్షణం బట్టి సవరించడం అన్నది అర్ధరహితం అయ్యుడటం [ఊదా: ఒక విడియో ఫైల్]. దత్త/సమాచార ఫైళ్ళను సవరించడానికి, సంబంధిత ప్రోగ్రామ్ ఫైల్ అవసరమవుతుంది (చాలా సార్లు అది ఏ ప్రోగ్రామ్‌తో అయితే సృష్టించారో అదే ప్రోగ్రామ్). • వోర్డ్ పత్రాన్ని(డాక్యుమెంట్‌ను) సవరించడం
మైక్రోసాఫ్ట్ వోర్డ్ పత్రాన్ని(డాక్యుమెంట్‌ను) మనం మైక్రోసాఫ్ట్ వోర్డ్ అనే ప్రోగ్రామ్‌లో సవరిస్తాము.
భద్రపరచబడి వున్న వోర్డ్ డాక్యుమెంట్‌ను తెరిచి లేదా సరికొత్త పత్రాన్ని సృష్టించి, దానిలో కూర్పులు, మార్పులు చేర్పులు చేసి, సవరించబడ్డ రూపంలో ఆ పత్రాన్ని భద్రపరచడం. • స్ప్రెడ్ షీట్‌ను సవరించడం
మైక్రోసాఫ్ట్ ఎక్సెల్‌తో సృష్టించిన స్ప్రెడ్ షీట్ పత్రాన్ని, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్‌లో సవరిస్తాము.
భద్రపరచబడి వున్న ఎక్సెల్ స్ప్రెడ్ షీట్‌ను తెరిచి లేదా సరికొత్త ఎక్సెల్ స్ప్రెడ్ షీట్‌ను సృష్టించి, దానిలో కూర్పులు, మార్పులు చేర్పులు చేసి, సవరించబడ్డ రూపంలో ఆ స్ప్రెడ్ షీట్ పత్రాన్ని భద్రపరచడం. • బిట్ మ్యాప్ చిత్రాన్ని సవరించడం
బిట్ మ్యాప్ చిత్రాన్ని మనం విండోస్ పెయింట్ బ్రష్‌తో లేదా బిట్ మ్యాప్ చిత్రాలను సవరించగల సత్తా వున్న ఏ యితర ప్రోగ్రామ్‌ను [ఉదా: అడోబి ఫొటోషాప్, కొరెల్ డ్రా, మొ"నవి] వుపయోగించయినా సవరించవచ్చు.
భద్రపరచబడి వున్న బిట్ మ్యాప్ చిత్రాన్ని తెరిచి లేదా సరికొత్త బిట్ మ్యాప్ చిత్రాన్ని సృష్టించి, దానిలో మార్పులు చేర్పులు చేసి, సవరించబడ్డ రూపంలో భద్రపరచడం. బిట్ మ్యాప్ చిత్రాన్ని సవరించడంలోలాగా ఒక దత్తాంశ/సమాచార ఫైల్‌ను సరిచేసే సత్తా ఒకటికంటే ఎక్కువ ప్రోగ్రామ్స్‌కు వుండవచ్చు. » వీక్షించడం/చదవడం
ఒక ప్రోగ్రామ్ ఫైల్‌ను పనిచేయించడం ద్వారా వుపయోగించుకుంటాము. ఒక దత్త/సమాచార ఫైలును సవరించవచ్చు లేదా కేవలం వీక్షించవచ్చు/చదవొచ్చు. వీక్షించడం/చదవడం అనే మాటకు ఇక్కడ విస్తారమైన అర్ధం ఆపాదించాలి. అది నకలు తీయడం, ముద్రించడం లాంటి పనులను కూడా ఉద్దేశిస్తుంది. కేవలం వీక్షించడం/చదవడం వరకే అవకాశం వున్న ఫైళ్ళను Read Only ఫైళ్ళు అంటారు.
దత్త/సమాచార ఫైళ్ళను వీక్షించడానికి/చదవడానికి కూడా ప్రోగ్రామ్స్ అవసరమే. అయితే ఒక దత్త ఫైల్‌ను స్రుష్టించడానికి/సవరించడానికి వుపయోగపడే ప్రోగ్రామ్‌కు వున్నంత సత్తా ఫైళ్ళను కేవలం వీక్షించడానికి/చదవడానికి పనికొచ్చే ప్రోగ్రామ్‌కు వుండకపోవచ్చు. • మైక్రోసాఫ్ట్ వోర్డ్ రీడర్
మైక్రోసాఫ్ట్ వోర్డ్ రీడర్ (మైక్రోసాఫ్ట్ వోర్డ్లోని కొన్ని లక్షణాలు [సవరించడానికి అవసరమైనవి] తొలగించబడినది), అనే ప్రోగ్రామ్‌తో మీరు మైక్రోసాఫ్ట్ వోర్డ్ పత్రాలను (డాక్యుమెంట్స్‌ను) తెరిచి చదవగలుగుతారు/వీక్షించగలుగుతారు, ముద్రించగలుగుతారు, పత్రంలో వున్న పాఠం మొత్తం కాని, లేదా కొంత కాని నకలు తీసుకోగలుగుతారు కానీ ఆ పత్రంలో పాఠాన్ని మాత్రం సవరించలేరు. మైక్రోసాఫ్ట్ వోర్డ్ పత్రాన్ని సవరించడానికి పూర్తి స్ధాయి పనితనమున్న మైక్రోసాఫ్ట్ వోర్డ్ ప్రోగ్రామ్ కావాలి.
• PDF ఫైల్‌ను వీక్షించడం/చదవడం
ఇంటర్నెట్ వాడకందారులు ఎక్కువగా చూసే Read Only ఫైల్, ఒక PDF పత్రం/డాక్యుమెంట్. మీరు కొంచెం నిశితంగా పరిశీలిస్తే మీరు PDF ఫైలును తెరిచి వీక్షించడానికి/చదవడానికి వుపయోగించే ప్రోగ్రామ్ Adobe Acrobat Reader అని గమనించవచ్చు.
ఇది ఎడోబి యాక్రోబాట్ అనే ప్రోగ్రామ్‌లో కొన్ని లక్షణాలు [సవరించడానికి అవసరమైనవి] తొలగించబడ్డ ప్రోగ్రామ్. ఎడోబి యాక్రోబాట్ ప్రోగ్రామ్‌లో PDF ఫైళ్ళను సవరించవచ్చు. ఎడోబ్ యాక్రోబాట్ రీడర్ ప్రోగ్రామ్‌తో PDF ఫైళ్ళను కేవలం తెరిచి వీక్షించవచ్చు/చదవవచ్చు. రీడర్ ప్రోగ్రామ్‌తో ఫైళ్ళను ముద్రించడం, నకలు తీసుకోవడం లాంటివి కూడా చేయవచ్చు (ఆ PDF ఫైళ్ళను తయారు చేసిన వారు ఎడోబి యాక్రోబాట్‌లో వున్న భద్రతా ఫీచర్స్ వుపయోగించి ఈ పనులను నిరోధించనట్లైతే). పూర్తిస్ధాయిలో కాకుండా కొన్ని లక్షణాలు తొలగించబడి, కొన్ని నిరోధాలతో పనిచేసే ప్రోగ్రాములను Stripped down versions అంటారు. |
| HTML ఫైల్ ఎడిటర్లు రీడర్లు | |
• HTML ఫైళ్ళు
".htm" లేదా ".html" ను పేరు పొడిగింపుగా కలిగిన ఫైళ్ళే HTML ఫైళ్ళు లేదా HTML పత్రాలు. సాధారణంగా మనం దత్తాంశ/సమాచార ఫైళ్ళను వాటి యొక్క పేరు పొగిగింపునుబట్టి (file name extension) గుర్తించడం, వర్గీకరిచడం జరుగుతుంది. ఆ ఫైళ్ళకు వున్న పేరు పొడిగింపు .exe, .com, .bat కాదు కాబట్టి యివి దత్తాంశ/సమాచార ఫైళ్ళే, (ప్రోగ్రామ్ ఫైళ్ళు కాదు). HTML ఫైళ్ళు దత్తాంశ/సమాచార ఫైళ్ళే కాబట్టి వాటిని సవరించడానికి/వీక్ష్జించడానికి ప్రోగ్రామ్స్ అవసరం.
• HTML ఫైళ్ళలో ఏమి వుంటుంది
HTML ఫైల్‌లో మీరు ఆ ఫైల్‌ను బ్రౌసర్‌లో తెరిచినప్పుడు కనపడే అక్షర/చిహ్న పాఠం, మరియు అనేక HTML గుర్తులు (<p>, <table>, <div>, <script>, <b>, <body> లాంటివి) అక్షర/చిహ్న పాఠం మధ్యలో చొప్పించబడి కనపడతాయి. [HTML గుర్తులు అక్షర/చిహ్న పాఠాన్ని చుట్టి వుంటాయి అని కూడా అనవచ్చు].
మీ బ్రౌసర్‌లో ప్రదర్శించబడుతున్న వెబ్ పుటకు సంబంధించిన పాఠాన్ని చూడదలుచుకుంటే, జాబితా పట్టీలో (Menu Bar - View | Source అనే ఐచ్ఛికను ఎంచుకోండి. లేదా మౌస్ సూచిని బ్రౌసర్‌లో ఏదన్నా ఖాళీ ప్రదేశం వైపు చూపుతూ మౌస్ కుడి బొత్తం నొక్కండి. ప్రదర్శించబడే లఘిష్ట జాబితాలో (Short cut menu - View(Page) Source ఐచ్ఛికను ఎంచుకోండి. » HTML ఫైళ్ళను సవరించడానికి ప్రోగ్రాములు
ఒక HTML ఫైల్‌ను అనేక ప్రోగ్రాములలో సవరించవచ్చు. అక్షర/చిహ్నపాఠం (text) మాత్రమే సవరించగల ఏ ప్రోగ్రామ్‌లోనయినా (విండోస్ నోట్ పాడ్, వోర్డ్ పాడ్) ఒక HTML ఫైల్‌ను సవరించవచ్చు. HTML ఫైల్‌ను సవరించడానికి వుద్దేశించిన ప్రత్యేక ప్రోగ్రామ్స్ (మైక్రోసాఫ్ట్ ఫ్రంట్‌పేజ్, ఎడోబి డ్రీమ్‌వీవర్ మొ"నవి). ఇవి అనేక ఇతర సంబంధిత పనులు కూడా చేయగలవు. వోర్డ్ ప్రోసెసింగ్ ప్రోగ్రాములు (మైక్రోసాఫ్ట్ వోర్డ్ వంటివి) కూడా HTML ఫైళ్ళు సవరించే ప్రోగ్రాములుగా వుపయోగించవచ్చు.
» బ్రౌసర్‌లు : HTML ఫైళ్ళను చదవడానికి/వీక్షించడానికి ప్రోగ్రాములు
HTML ఫైల్ చదవడమంటే కేవలం ఆ ఫైల్‌లో వున్న అక్షర పాఠాన్ని text చూపించడం కాదు. HTML చదివే ప్రోగ్రామ్ పాఠంలో భాగంగా వున్న HTML గుర్తులను ఆధారంగా ఆ ఫైల్‌లో వున్న పాఠాన్ని ప్రదర్శించాల్సి వుంటుంది.
సాధారణంగా ఒక రకమైన ఫైల్‌ను సవరించడానికి వుపయోగపడే ప్రోగ్రాము, అ ఫైల్‌ను చదవడానికి/వీక్షించడానికి కూడా వుపయోగపడుతుంది. [వో్ర్డ్ పత్రం(డాక్యుమెంట్)ను మైక్రోసాఫ్ట్ వోర్డ్ ప్రోగ్రామ్‌ను వుపయోగించి సరిచేస్తాము మరియు అదే ప్రోగ్రామ్‌ను వుపయోగించి చదువుతాము/వీక్షిస్తాము]. అయితే ఒక HTML ఫైల్‌ను సవరించడానికి వుపయోగపడే ప్రోగ్రామ్, ఆ ఫైల్‌ను చదవడానికి/వీక్షించడానికి వుపయోగపడదు. HTML ఫైల్‌ను చదవడానికి/వీక్షించడానికి బ్రౌసర్ అని పిలవబడే ప్రత్యేకమైన ప్రోగ్రామ్‌ను వుపయోగిస్తాము. ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్, ఫైర్‌ఫాక్స్, సఫారీ, నెట్‌స్కేప్ నావిగేటర్, ఒపెరా మొదలగు ప్రోగ్రాములు బ్రౌసర్ ప్రోగ్రాములే |
| HTML గుర్తులు (Tags) | |
HTML గుర్తులు బ్రౌసర్‌కు నిర్ధేశాలు. ఇవి పాఠాన్ని బ్రౌసర్ గవాక్షంలో ప్రదర్శించేటప్పుడు ఎలా రూపకల్పన చేసి చూపాలి అనే దానికి బ్రౌసర్‌కు నిర్ధేశాలుగా పనిచేస్తాయి. ప్రతి HTML గుర్తు బ్రౌసర్‌కు ఏదో ఒక ఆలోచనని నిర్ధేశిస్తుంది. ఈ HTML గుర్తుల ఆధారంగా మీరు వెబ్ పుటలో చేర్చిన పాఠానికి శైలిని, రూపలావణ్యాన్ని బ్రౌసర్ చేకూరుస్తుంది.
• మొదలు గుర్తు
HTML గుర్తులలో మొదలు గుర్తు అనగా < మరియు > మద్య బంధింపబడి ఒకటి లేక అంతకంటే ఎక్కువ అక్షరాలతో ఏర్పడ్డ పదం. (<div>, <table>, <b>, <p>, <img> మొదలగునవి) ఇది HTML గుర్తుల మధ్య బందింపబడ్డ పాఠం మొదలును తెలియచేస్తుంది.
• అంతం గుర్తు
మొదలు HTML గుర్తుకు అదనంగా "< " చిహ్నం వెంబడే " / " చిహ్నం చేరిస్తే వచ్చే రూపమే అంతం HTML గుర్తు. (</div>, </table>, </b>, </p>, </img> మొదలగునవి) ఇది HTML గుర్తుల మధ్య బందింపబడ్డ పాఠం అంతాన్ని తెలియచేస్తుంది.
|
| వెబ్ పుట (Web Page) | |
• వెబ్‌పుట : ఒక HTML ఫైల్
ప్రతి వెబ్ పుటకు ఒక సరళమైన అర్ధం HTML ఫైల్ అని. ఒక వెబ్ పుట ఒక HTML ఫైల్ అవ్వొచ్చు లేదా HTML కోడ్ కలిగిన ఏ యితర ఫైలైనా అవ్వొచ్చు. ఒక వెబ్ పుటలో వున్న మొత్తం HTML కోడ్ <HTML>> గుర్తుతో మొదలయ్యి </HTML>> గుర్తుతో అంతమవుతుంది. సాధారణంగా ఈ గుర్తులు వరుసగా వెబ్ పుట మొదలు, అంతాలలో కనపడతాయి.
• .asp, .php, .jsp, .g పేరు పొడిగింపులతో వుండే ఫైల్స్ : వెబ్‌పుటలేనా!
వెబ్ పుటల యొక్క సాధారణ రూపం HTML ఫైళ్ళు (.HTML, .htm పేరు పొడిగింపులుగా కలిగినవి). మీరు ఇంటర్నెట్‌లో పుటలను వీక్షించేటప్పుడు .asp, .php, .jsp లాంటి పేరు పొడిగింపులతో వుండే ఫైళ్ళుచూసే వుంటారు.
అవును ఇవి కూడా బ్రౌసర్‌లో ఈ పుటలను వీక్షించేవారికి వెబ్ పుటలే అవుతాయి. బ్రౌసర్ ఈ పుటలను సాధారణ HTML ఫైళ్ళ లాగానే భావించి సంభాళించగలగడానికి కారణం. వీటన్నింటిలో వుండేది HTML గుర్తులతో వర్గీకరించబడ్డ పాఠం (content) అవ్వడమే. ఆ ఫైళ్ళన్నింటిలో పాఠం మొదట్లో వున్న <HTML> గుర్తు, ఆ ఫైళ్ళు వెబ్ పుటలే అని బ్రౌసర్ అర్ధం చేసుకోవడానికి వుపయోగపడుతుంది. » మరి వేరు వేరు పేరు పొడిగింపులు ఎందుకు?
ఈ ఫైళ్ళను బ్రౌసర్‌కు పంపే సర్వర్ ఈ ఫైళ్ళను వేరు వేరుగానే గుర్తిస్తుంది. వీటిలో సర్వర్ అమలుపరిచే (run) కంప్యూటర్ ప్రోగ్రామ్ కోడ్ వుంటుంది. అలా కోడ్‌ను సర్వర్ అమలు పరచిన (run) కారణంగా తయారైన పాఠాన్ని ఆ పుటను అడిగిన బ్రౌసర్‌కు/కంప్యూటర్‌కు పంపుతుంది.
|
| బ్లాగ్ పోస్ట్‌కు వుపయోగించే HTML కోడ్ | |
|
ఒక వెబ్ పుట మొత్తం HTML గుర్తులతో ఏర్పరచబడుతుంది. అయితే మనం యిక్కడ మన ఆలోచనను బ్లాగ్ పోస్ట్‌కు సంబంధంగా వుపయోగించ గలిగిన గుర్తులకు మాత్రమే పరిమితం చేస్తాము. దిగువన కూర్పులో వున్న ఒక బ్లాగ్ పోస్ట్ ఉదహరించబడివుంది.
ఇక్కడ గజిబిజిగా వున్న HTML గుర్తులను చూసి గందరగోళపడకండి. ఇవి మీరు బ్లాగ్ పోస్ట్‌లో పాఠాన్ని చేర్చడానికై, పాఠాన్ని పట్టి వుంచే రకరకాల గుర్తులు అని అర్ధం చేసుకోండి. ఇవి మీ పోస్ట్, ప్రచురించబడ్డ తరువాత మీ బ్లాగ్‌ను ప్రదర్శించే పుటలో ఎలా చూపబడుతుంది అనే దానిని నిర్ధేశిస్తాయి. పైన చూపబడ్డ బ్లాగ్ పోస్ట్, ప్రచురించబడ్డ తరువాత ఈ క్రింది విధంగా కనపడుతుంది.
|
| HTML అంశాలు (elements) | |
HTML గుర్తు (Tag), HTML అంశం (Element) అనే మాటలు సాంకేతికంగా పర్యాయ పదాలు కానప్పటికీ వాటిని పర్యాయ పదాలుగా వాడటం కనపడుతుంది షుమారుగా HTML ఫైల్‌లో వున్న పాఠం (Content) మొత్తం, జతలుగా వున్న అనేక ప్రత్యేక గుర్తుల (మొదలు గుర్తు, అంతం గుర్తు) మధ్య చేర్చబడి HTML అంశాల క్రింద ఏర్పరచబడి వుంటుంది. వెబ్ పుటకు ఆకృతిని ఏర్పరచడానికి అవసరమైన నిర్ధేశాలన్నీ ఈ గుర్తులలోనే వుంటాయి. బ్రౌసర్ ప్రతి HTML అంశాన్ని ఒక విభాగం క్రింద పరిగణిస్తుంది. బ్రౌసర్ ఆ విభాగంతో ఎలా వ్యవహరించాలనే విషయాన్ని ఆ అంశాన్ని చుట్టి వున్న గుర్తును బట్టి అర్ధం చేసుకుంటుంది. ఒక వెబ్ పుట లోని మొత్తం పాఠాన్ని HTML గుర్తులతో జోడిస్తాము. HTML కోడ్ వ్రాయడమంటే మనం వెబ్ పుటలో ప్రదర్శించబడుతున్న పాఠాన్ని అవసరమైన/అనుచితమైన HTML గుర్తుల మధ్యలో పెట్టడం అవుతుంది. అవును HTML నేర్చుకోవడమంటే యింత సులువే. |
| HTML అంశాల గుణములు (Element attributes) | |
HTML అంశము యొక్క గుణాలను దాని మొదలు గుర్తులో నిర్దేశించడం ద్వారా నిర్వచిస్తాము. ప్రతి HTML అంశానికి అనుమతించబడిన కొన్ని గుణాలు వుంటాయి. ఒకే అంశానికి రెండు వేరు వేరు గుణాలను నిర్వచించాల్సి వస్తే వాటిని ఒక దాని తరువాత ఒకటి మద్యలో ఖాళీతో (ఎడం కమ్మితో సృష్టించబడ్డ ఖాళీ) విడదీస్తూ ఆ అంశమునకు సంబంధించిన మొదలు గుర్తులో భాగంగా చేర్చవచ్చు.. HTML అంశము యొక్క గుణ నిర్వచనము ఈ రూపంలో వుంటుంది.
• ఉదాహరణ » 1
ఒక పరిచ్ఛేదమును నిర్వచించే గుర్తు - <p>.
కొంత అక్షర పాఠాన్ని ఒక పరిచ్ఛేదములో చూపిద్దామనుకుంటే, ఆ పాఠానికి మొదలులో <p> గుర్తు చివరలో </p> గుర్తు వుంచుతాము. పరిచ్ఛేదమునకు లీనము (alignment) నాలుగు రకాలుగా వుండవచ్చు. ఎడమ (left), కుడి (right), కేంద్రమయిన (centered), సమర్దించబడిన (justified). పరిచ్ఛేదమునకు లీనమును సూచించే గుణము పేరు align. కాబట్టి <p> గుర్తులో align="left"అని చేరిస్తే అది పరిచ్ఛేదమునకు ఎడమ లీనమయ్యే గుణాన్ని ఆపాదించినట్లు. <p align="left">. బ్రౌసర్ ఈ పరిచ్ఛేద అంశానికి ఎడమ లీన లక్షణము చేకూర్చాలని ఆ పరిచ్ఛేదమును సూచించే మొదలు గుర్తులో వున్న గుణమును బట్టి అర్దం చేసుకుంటుంది. • ఉదాహరణ » 2<font face=arial size=3 color=blue><font> గుర్తు, తదుపరి అక్షర పాఠం మరియు చివర </font> గర్తు కలిపి ఒక HTML అంశము అవుతుంది. ఈ అంశానికి దిగువ పట్టికలో ఇవ్వబడిన గుణాలు ఆపాదించబడి వున్నాయి.
ఈ అంశము కేవలం ఒకే రకమైన ఆకృతి రూపలావణ్యం కలికిన అక్షరాలు/గుర్తుల సమూహాన్ని సూచిస్తుంది. • ఉదాహరణ » 3<div align=center width=200px><div> గుర్తు తదుపరి ఏ పాఠమయినా (విభాగములో పెట్టదగినది) మరియు చివర </div> గుర్తు కలిపి ఒక HTML అంశము అవుతుంది. ఈ అంశానికి 2 గుణాలు ఆపాదించబడివున్నాయి. ఈ అంశము ఒక పేటిక లాంటిది. విభాగము (Division) అని పిలువబడుతుంది.
• ఒక అంశానికి ఎన్ని గుణాలు వుంటాయి?
ఒక HTML అంశానికి ఎన్ని గుణాలు నిర్వచించవచ్చు అనేది ఆ అంశం మీద ఆధారపడి వుంటుంది.
ప్రతి అంశానికి నిర్వచించదగ్గ గుణాల జాబితా ఇక్కడ తయారు చెయ్యడం అంత సమంజసం కాదు. మీరు HTML అంశాల గురించి తెలుసుకునే కొద్దీ, వాటికి మీరు నిర్వచించదగ్గ గుణాలు ఏముంటాయి అనేది అర్దమవుతూ వుంటుంది.
HTML నేర్చుకోవడమంటే HTML పుట/పత్రం (డాక్యుమెంట్‌లో) వుండదగ్గ అంశాలన్నింటిని గురించి తెలుసుకోవడం మరియు ప్రతి అంశమునకు అనుమతించబడ్డ గుణాలు వాటికి ఆ అంశానికి సంబంధంగా ఏమేమి విలువలు వినియోగించవచ్చు అనేది తెలుసుకోవడమే. ఈ ఆలోచన మీరు క్షుణ్ణంగా తెలుసుకుంటే HTML నేర్చుకోవడం చాలా తేలికైపోతుంది. మరల ఇంకొకసారి చెబుతున్నాము "అవును చాలా తేలిక". |
| శైలి (Style) గుణము | |
• ప్రత్యేకమైన గుణము » శైలి(Style)
HTML అంశాల ప్రవర్తన (రూపకల్పన తదితర విషయాలలో) మీకు ఇంకా ఎక్కువ అదుపు కోసం ఒక ప్రత్యేకమైన గుణం (Attribute) వుపయోగపడుతుంది. మిగతా గుణాలన్నీ HTML అంశానికి ఒక లక్షణాన్ని ఆపాదిస్తాయి. Style పేరుతో వున్న గుణం వుపయోగించి మాత్రం ఒకేసారి అనేక లక్షణాలను ఆపాదించగలుగుతాము.
HTML అంశానికి Style గుణం ద్వారా ఆపాదించే వాటిని లక్షణాలు అంటారు. ఒకేసారి Style గుణాన్ని వుపయోగిస్తూ అనేక లక్షణాలను ఆపాదించేటప్పుడు బేధం చూపడం కోసం వాటిని విడదీయటానికి మధ్యలో " ; (సెమీ కోలన్) " గుర్తును వాడతాము. Style గుణం ఈ క్రింది నమూనాలో కనపడుతుంది.
• ఉదాహరణ » 1<p align=right style"font:14px verdana; border:1px solid red">
• ఉదాహరణ » 2<span style="font:bold 20px trebuchet ms; background-color:yellow;" >
• శైలి లక్షణాలు : HTML ఆంశ గుణాలు
శైలి లక్షణాలు, HTML ఆంశ గుణాలు కలిపి వాడవచ్చు. శైలి లక్షణానికి HTML ఆంశ గుణం మీద అగ్రగామిత్వం (Precedence) వుంటుంది.
ఒక వేళ ఒకే ఆలోచనను HTML ఆంశ గుణం ద్వారా మరియు శైలి లక్షణం ద్వారా నిర్వచించి వుంటే బ్రౌసర్ శైలి లక్షణానికున్న విలువను పరిగణలోకి తీసుకుని HTML ఆంశ గుణం విలువను విస్మరిస్తుంది.
» ఉదాహరణ
ఒక పట్టిక మొదలును నిర్వచించే ఈ క్రింది HTML గుర్తును పరిగణించండి.
<table width=600px align=center style="width:400px">ఈ HTML <table> అంశానికి వెడల్పు 600px అని అంశ గుణం ద్వారా (width=600px) మరియు 400px అని శైలి లక్షణం ద్వారా (width:400px) నిర్వచించబడి వున్నది. ఇక్కడ ఒక అంశానికి ఒకే ఆలోచన రెండు చోట్ల చెప్పబడి వుంది, కాబట్టి, బ్రౌసర్ శైలి లక్షణానికున్న విలువను పరిగణలోకి తీసుకుంటుంది (శైలి లక్షణాలికి HTML ఆంశ గుణం మీద అగ్రగామిత్వం వుంటుంది కాబట్టి). |
| CSS : వెబ్ పుటలోకి పారే శైలి పత్రం | |
|
ఒక HTML అంశానికి అనువర్తించదలుచుకున్న శైలి లక్షణాలు ఆ HTML అంశానికి సంబంధించిన మొదలు గుర్తు (opening tag) లోపల నిర్వచించవచ్చు. ఈ శైలి లక్షణాలను, HTML పుట/పత్రంలో (document) ఒక HTML శైలి అంశం యొక్క (style element) [<style> ... </style>] పాఠంగా కూర్చి లేదా ఆ HTML పతానికి/పుటకు జోడిస్తూ వెలుపల ఇంకొక ఫైలులో నిర్వచించవచ్చు.
Cascading Style Sheet (CSS) అంటే పారే శైలి పత్రం అర్ధం. ఇది ఒక HTML పత్రానికి (document) అనుసంధించదగ్గ ఒక ఫైలు. ఈ ఫైలు .css పేరు పొడిగింపు కలిగి వుంటుంది. ఈ ఫైలు ఏ HTML పత్రానికైతే అనుసంధిచబడివుందో ఆ పత్రంలో వున్న HTML అంశాలకు శైలి లక్షణాల నిర్వచనాలు కలిగి వుంటుంది.
• ఉదాహరణతో వివరణ
వేరు వేరు చోట్ల 4 విభాగాలు <div> వున్న ఒక వెబ్ పత్రాన్ని పరిగణించండి. ఇవన్నీ ఒకే రకమైన ఒకే రకమైన శైలి లక్షణాలతో రూప కల్పన చేయబడ్డాయనుకోండి
<div style="background-color:ivory; border:2px double sienna;">నాలుగు చోట్ల కూడా అవే శైలి లక్షణాలు నిర్వచించబడి వున్న అదే గుర్తు కనపడుతుంది. ఇది శైలి లక్షణాలను HTML అంశ గుణంగా HTML అంశ మొదలు గుర్తులో చేర్చడం అవుతుందిఈ శైలి లక్షణాలనే ఇంకో రెండు రకాలుగా నిర్వచించవచ్చు » <style> HTML అంశ పాఠంగా కూర్చి
పత్రంలో వినియోగించబడుతున్నటువంటి శైలి లక్షణాలను ఒకటి లేక అంతకంటే ఎక్కువ <style> శైలి అంశాల పాఠ భాగంగా చేర్చి శైలిని HTML అంశాలకు అనువరింప చేయవచ్చు
<style type="text/css">
• Class, ID గుణాలతో శైలి నిర్వచనాలను HTML అంశాలకు అనువరింపచేయడం
శైలి అంశ పాఠ భాగంగా చేర్చిన శైలి లక్షణ నిర్వచనాలను HTML అంశాలకు అనువర్తింపచేయడం ఎలా అనేది, అవి నిర్వచించిన తీరు మీద ఆధారపడివుంటుంది
నిర్వచనాలలో "., #" తదుపరి వున్న పదం ఆ నిర్వచనానికి నిర్ధిష్ట గుర్తింపు (నామం) అవుతుంది "." ఉపయోగించి చేసిన నిర్వచనాలను class గుణం వుపయోగించి, "#" ఉపయోగించి చేసిన నిర్వచనాలను ID గుణం వుపయోగించి అనువర్తిస్తాము. class/ID గుణానికి ఆపాదించే/చేర్చే విలువ, అనువర్తింపచేయదలుచుకున్న నిర్వచనం యొక్క గుర్తింపు/నామం పైన ఇవ్వబడ్డ నిర్వచనాలను అంశాలకు అనువరింపచేయడం
• Class : వర్గం
• ID : గుర్తింపు
• శైలి అంశాన్ని వెబ్ పత్రంలో ఎక్కడ చేర్చాలి
ఎక్కడైనా చేర్చవచ్చు. అయితే నిర్వచనం వినియోగించబడే ముందు నిర్వచనం వుండాలి
బ్రౌసర్ వెబ్ పుటలోని పాఠాన్ని వరుసగా చదువుకుంటూ, ప్రదర్శిస్తూ ముందుకు వెళ్తుంది. శైలి అంశ పాఠం, స్చ్రిప్ట్ ఆంశ పాఠం లాంటి వాటిని అవి ఎదురు పడగానే చదివి తదుపరి వినియోగించుకోవాల్సి వస్తుందనే వుద్దేశ్యంతో గుర్తుంచుకుంటుంది. శైలిని వుపయోగించడానికి ముందు దాని నిర్వచనం వున్నట్లయితే అది అప్పటికే చదివి గుర్తు పెట్టుకుంది కాబట్టి దానిని అనువరించగలుగుతుంది. ఈ కారణంగా యిటువంటి HTML అంశాలను <span>, <script>,మొదలగు వాటిని వెబ్ పుట శీర్ష భాగంలో చేరుస్తారు. బ్రౌసర్ ఒక పుటను గవాక్షంలో నింపుకునేటప్పుడు, శీర్ష భాగంలో వున్న మొత్తాన్ని నింపుకున్న తరువాత మాత్రమే పుట ముఖ్య భాగాన్ని సంభాళించడం మొదలు పెడుతుంది. తద్వారా పుటలో వినియోగించబడ్డ శైలి లక్షణాల నిర్వచనాలన్నీ బ్రౌసర్ ముందే చదుకుని వుండేటట్లు నిర్ధారించుకున్నట్లవుతుంది • శైలి అంశం వాడటంలో వున్న వుపయోగం
శైలి అంశం వాడటం వలన అనేక్ చోట్ల ఒకే నిర్వచనాన్ని వినియోగించుకునే అవకాశం వుంటుంది. దీని వలన అన్ని చోట్ల రూపు రేఖలు ఒకే రకంగా వుండేటట్లు నిర్ధారించుకోవచ్చు, మరియు అదే పనిని మరల మరల చెయ్యడం తప్పించుకోవచ్చు
» పుటకు అనుసంధించబడ్డ బాహ్య css ఫైల్‌లొ చేర్చి
ఆదే పనితనం కోసం శైలి నిర్వచనాలన్నీ ఒక బహ్య ఫైల్‌లో చేర్చి, దాని వివరాలను వెబ్ పుట శీర్ష భాగంలో చేర్చి దానిని వెబ్ పుటకు అనుసంధించడం ద్వారా పొందవచ్చు
<head>
<link rel="stylesheet" type="text/css" href="blog_format.css" /> </head> శైలి నిర్వచనాలున్న ఫైల్‌ను CSS ఫైల్ అంటాము. దానికి .css పేరు పొడిగింపు వుండాలి. పైన ఉదాహరణలోని శైలి నిర్వచనాలను CSS ఫైల్ ద్వారా అనువర్తించేటట్లయితే, ఫైల్ పాఠం యిలా వుంటుంది
.one {background-color:ivory; border:2px double siena;}
div.ank {font:12pt/18pt trebuchet ms; color:navy;} #moon {background-color:white; color:gold;} td#soon {background-color:white; color:gold;} శైలి అంశ పాఠంగా శైలి లక్షణాలను నిర్వచించడానికి, వేరే పుటలో నిర్వచించడానికి మధ్య తేడా ఏమీ లేదు. ఫైల్‌లో <style> గుర్తులను కూడా వాడే/చేర్చే పొరపాటు చేయగలరు, జాగ్రత్త. • CSS ఫైల్ వాడటంలో వున్న వుపయోగం
శైలి అంశం వాడటం వలన వున్న ఉపయోగాలన్నీ CSS ఫైల్ వాడటంలో పొందగలుగుతాము. అదనంగా ఒకే ఫైల్‌ను ఒక వెబ్ సైట్‌లోని అనేక పుటలకు అనువర్తించడం ద్వారా వెబ్ సైట్‌లోని అన్ని పుటలకు ఒకే రూపాన్ని అనువరించగలుగుతాము
యిలా ఒకే ఫైల్‌ను అనేక్ పుటలకు వినియోగిస్తున్నట్లయితే, ఆ పుటల రూపురేఖలను, కేవలం ఆ CSS ఫైల్‌లో మార్పులు చేయడం ద్వారా తేగలుగుతాము. అసలు ఫైళ్ళను తెరవవలసిన అవసరం కూడా వుండదు • శైలి లక్షణాలు : అగ్రగామిత్వం
ఒక HTML అంశానికి ఒక ఆలోచనకు సంబంధించిన నిర్వచనం, అంశం మొదలు గుర్తులో భాగంగా చేర్చి అంశ గుణంగాను, శైలి లక్షణంగాను, పుటలో చేర్చబడ్డ శైలి అంశ పాఠంలోని నిర్వచనంగాను, భాహ్య ఫైల్‌లో పాఠంలోని నిర్వచనంగాను అన్ని చోట్లా వున్నట్లయితే, బ్రౌసర్ వీటి అగ్రగామిత్వాన్ని బట్టి, ఏదో ఒక దానినే అంశానికి అనువర్తిస్తుంది.
బ్రౌసర్ పరిగణించే క్రమం
• ఒక HTML అంశానికి ఏయే శైలి లక్షణాలు వాడవచ్చు?
ఒక HTML అంశానికి ఏయే శైలి లక్షణాలు వాడవచ్చు అనేది ఆ అంశం మీద ఆధారపడి వుంటుంది.
ప్రతి అంశానికి నిర్వచించదగ్గ శైలి లక్షణాల జాబితా ఇక్కడ తయారు చెయ్యడం అంత సమంజసం కాదు. మీరు HTML అంశాల గురించి తెలుసుకునే కొద్దీ, వాటికి మీరు నిర్వచించదగ్గ శైలి లక్షణాలు ఏముంటాయి అనేది అర్దమవుతూ వుంటుంది.
HTML నేర్చుకోవడమంటే HTML పుట/పత్రం (డాక్యుమెంట్‌లో) వుండదగ్గ అంశాలన్నింటిని గురించి తెలుసుకోవడం మరియు ప్రతి అంశమునకు అనుమతించబడ్డ గుణాలు, శైలి లక్షణాలు, వాటికి ఆ అంశానికి సంబంధంగా ఏమేమి విలువలు వినియోగించవచ్చు అనేది తెలుసుకోవడమే. ఈ ఆలోచన మీరు క్షుణ్ణంగా తెలుసుకుంటే HTML/CSS నేర్చుకోవడం చాలా తేలికైపోతుంది. మరల ఇంకొకసారి చెబుతున్నాము "అవును చాలా తేలిక". |
| అనువాదం :: నేర్పు జట్టు | ఈ పుటకు అంగ్ల మూలం | ... తరువాతి పుట ౧౬ (16) |




