ముందు పుట ... ౯ (9) |
పాఠం వర్గీకరణ | |
ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్లను వోర్డ్ ప్రోసెసర్ (మైక్రోసాప్ట్ వోర్డ్) వంటి వాటిలో గాని ఇంటర్నెట్‌లో వుపయోగించేందుకు వెబ్ పుటలను గాని, తయారు చేయడంలో, మొత్తం పాఠాన్ని చిహ్నాలు (Characters), అక్షరాలు (Letters), పదాలు (Words), వాక్యాలు (Sentences), పంక్తులు/శ్రేణులు (Lines), పరిచ్చేదాలు (Paragraphs), పుటలు (Pages), భాగాలు (Sections) గా వర్గీకరించవచ్చు.
• పాఠానికి రూపలావణ్యం చేకూర్చడం కొరకు వర్గీకరణ
రూపలావణ్యం చేకూర్చడం కోసం ఎలక్ట్రానిక్ పత్రంలో కనపడే చిహ్నాలన్నింటిని రెండుగా వర్గీకరిస్తాము. ఒకటి అక్షరాలు, రెండు పరిచ్ఛేదము. అక్షరాలకు రూపలావణ్యం చేకూర్చడానికి అనేక ఐచ్ఛికలు వుంటాయి. ఇవి ఒకటి అంతకంటే ఎక్కువ అక్షరాలు ఎంచుకుని, వాటికి అనువర్తించవచ్చు. అలాగే పరిచ్ఛేదాలకు చేకూర్చడానికి వున్న ఐచ్ఛికలు ఒకటి అంతకంటే ఎక్కువ పరిచ్ఛేదాలకు అనువర్తించవచ్చు.
|
చిహ్నాలు, అక్షరాలు, కుంచిక ఫలక కుంచికలు | |
ఒక భాషలో వుపయోగించబడే అక్షరాలు, అంకెలు ఇతర గుర్తులు అన్నీ కలిపి భాషా చిహ్నాలు అని అనవచ్చు. ఇంగ్లీషు భాషకు సంబంధించిన చిహ్నాల సమితిలో పెద్ద అక్షరాలు (Capital letters), చిన్న అక్షరాలు, 0 నుండి 9 వరకు అంకెలు, మరియు #, $, @ వంటి గుర్తులు వుంటాయి. ఇంగ్లీషు భాషలోని చిహ్నాల సమితి
ఈ గుర్తులన్నీ కుంచిక ఫలకం (Key board) లో వున్న కుంచికలను (Keys) వుపయోగించి పత్రంలో చేర్చవచ్చు. కొన్ని చిహ్నాలు ఒక కుంచిక నొక్కగానే పత్రంలో చేర్చబడతాయి. కొన్ని చిహ్నాలు చేర్చడానికి రెండు కుంచికలను ఒకే సారి వుపయోగించాల్సి వుంటుంది [ఉదా: "+" గుర్తును చేర్చడానికి, Shift కుంచిక నొక్కి పెట్టి వుంచి, తదుపరి + గుర్తు వున్న కుంచిక నొక్కుతాము]. ప్రతి గుర్తుకు కంప్యూటర్ గుర్తించడానికి వీలుగా ఒక నిర్ధిష్టమైన అంకెల సంకేతము (Numerical code) వుంటుంది. అంకెల సంకేతాన్ని ASCII (American Standards for computer Information Interchange) కోడ్ అంటారు. కుంచిక ఫలకంపై ఒక కుంచిక నొక్కగానే, కంప్యూటర్, నొక్కబడ్డ కుంచికకు సంబంధించిన సంకేతాన్ని గమనించి, దాన్ని బట్టి మీ కంప్యూటర్ తెర/స్ర్రీన్ మీద ఏ గుర్తు ప్రదర్శించాలి, పత్రంలో ఏ గుర్తు చేర్చాలి అనేది నిర్ణయించుకుంటుంది. • టాగుల్ కుంచికలు కొన్ని కుంచికలు మీటలుగా పనిచేస్తాయి. అవి వెయ్యడం తియ్యడం అనే భావంతో వుపయోగించవచ్చు. కుంచికను ఒకసారి నొక్కితే మీట వేసినట్లు, మరొకసారి నొక్కితే మీట తీసివేసినట్లు.
Caps Lock కుంచిక, సంఖ్యాత్మక కుంచికల మొత్త (Numerical Key Pad) లోని Num Lock కుంచిక, సంచార కుంచికల మొత్త (Navigational Key pad) లోని Scroll Lock కుంచికలు, కుంచిక ఫలకంలో వున్న మూడు టాగుల్ కుంచికలు. టాగుల్ కుంచికలకు సంబంధంగా సంఖ్యాత్మక కుంచికల బొత్త పైన మూడు సూచిక దీపాలు వుంటాయి. ఈ సంబంధిత దీపాలు వెలుగుతున్నట్లయితే ఆ కుంచికలు (మీట) వేసి వున్నట్లు, ఆరి వున్నట్లయితే సంబంధిత మీట కుంచిక తీసివున్నట్లు. • ఇంగ్లీషు భాషలోని పెద్ద అక్షరాలు, ఇతర గుర్తులు చేర్చడం
ఇంగ్లీషు భాష యొక్క పెద్ద అక్షరాలు చేర్చడానికి, సంబంధిత కుంచిక నొక్క బోయే ముందు షిప్ట్ కుంచిక నొక్కి పెట్టి వుంచాలి లేదా Caps Lock మీట వేయబడి వుండాలి.
ఒక కుంచిక మీద రెండు గుర్తులు వున్నట్లయితే, కుంచిక పై భాగంలో వున్న గుర్తును, Shift కుంచిక నొక్కి పెట్టి వుంచి, ఆ కుంచికను నొక్కడం ద్వారా పత్రంలో చేర్చవచ్చు. ఇటువంటి గుర్తులను పత్రంలో చేర్చడానికి Caps Lock మీట వుపయోగపడదు. • అంకెలు చేర్చడం
సంఖ్యాత్మక కుంచిక బొత్త (Numerical Key Pad) లోని Num Lock మీట వెయ్యబడి వున్నప్పుడు మాత్రమే ఆ బొత్తలోని అంకెల గుర్తులు వున్న కుంచికలను వుపయోగించి పత్రంలో అంకెలను చేర్చగలుగుతాము.
Num Lock మీట తీయబడి వున్నట్లయితే ఆ మొత్త సంచార కుంచికల మొత్త (Navigational Key pad) క్రింద పనిచేస్తుంది. సంఖ్యాత్మక కుంచికల మొత్తలో కేవలం ఒక గుర్తు మాత్రమే వున్న కుంచికలు Num Lock మీట వేసి వున్నా, తీసి వున్నా వినియోగించవచ్చు. • క్లిష్టమైన భాషా లిపులు
ఇంగ్లీషు భాష కాక క్లిష్టమైన లిపి వున్న భాషలలో (ఆసియా, అరబిక్ భాషల లాంటివి), చాలా సార్లు, ఒక అక్షరము అనేది రెండు అంతకంటే ఎక్కువ చిహ్నాల కలయికతో ఏర్పడుతుంది. అటువంటి భాషలలో ఒకసారి కుంచికను నొక్కితే అక్షరంలోని కొంత భాగం మాత్రమే పత్రంలో చేర్చబడవచ్చు. ఈ భాగమే ఒక చిహ్నమవుతుంది.
|
పదం (Word) | |
ఒకటి అంతకంటే ఎక్కువ అక్షరాలు మధ్య నిడివి లేకుండా వుండే రూపాన్ని పదంగా కంప్యూటర్ గుర్తిస్తుంది.
రెండు పదాలను విభజించేది మధ్యనున్న ఎడం (ఖాళీ ప్రదేశము). సాధారణంగా ఈ ఖాళీని కుంచిక ఫలకం (Key Board) మీద వున్న ఎడం కుంచిక (Space Bar) ను వుపయోగించి చేరుస్తాము. [ఎడం కుంచిక అంటే కుంచిక ఫలకంలో అన్నింటికంటే క్రింది వరుసలో పొడవుగా ఒక కమ్మి (Long bar) రూపంలో వుంటుంది]. రెండు చిహ్నాల మధ్య వున్న ఖాళీ (అది ఏ కుంచికతో ఏర్పరిచినదయిప్పటికీ) అది పదాలను విడగొట్టడానికి వుపకరించే ఖాళీనే అవుతుంది.
ఒక కుంచికను నొక్కినప్పుడల్లా ఒక సంబంధిత చిహ్నం పత్రంలో చేర్చబడుతుంది. ఎడం కమ్మి, ఇతర ఖాళీలను ఏర్పరిచే కుంచికల విషయంలో కూడా ఇది నిజమే. (ఈ కుంచిక వాడినప్పుడు చేర్చబడే గుర్తు అదృశ్యంగా వుంటుంది). ఆ కారణంగానే అక్కడ ఖాళీ వున్నట్లు మనకు కనబడుతుంది. |
వాక్యం (Sentence) | |
ఒకటి అంతకంటే ఎక్కువ పదాలు, చిట్టచివర విరామచిహ్నం, తదుపరి ఎడం కుంచికతో ఏర్పరచబడ్డ రెండు ఖాళీలు వున్న రూపాన్ని వాక్యంగా కంప్యూటర్ గుర్తిస్తుంది. ఆ పదాలు, విరామచిహ్నం మరియు రెండు ఖాళీలు కలిపి వాక్యంగా పరిగణిస్తుంది. ఇంగ్లీషు భాషలో వాక్యం యొక్క మొదటి అక్షరంగా పెద్ద అక్షరాలు (Capital letters) వాడుతాము. వోర్డ్ ప్రోసెసింగ్ ప్రోగ్రామ్‌లలో (మైక్రోసాప్ట్ వోర్డ్ లాంటివి), మనం ఒక వాక్యం పూర్తి చేసి యింకొక వాక్యానికి సంబంధించిన మొదటి అక్షరం చిన్న అక్షరం చేర్చగానే స్వయంచాలకంగా అది పెద్ద అక్షరంగా మారడం చూస్తాము. ఒక విరామచిహ్నం, తదుపరి రెండు ఖాళీల తర్వాత మీరు అక్షరాన్ని చేర్చడమే కంప్యూటర్ ప్రోగ్రామ్ మీరు చేర్చిన అక్షరాన్ని వాక్యం యొక్క మొదటి అక్షరంగా గుర్తించడానికి కారణం.
పరిచ్ఛేదాంత గుర్తు కూడా ఒక వాక్యాన్ని అంతమొందిస్తుంది. ప్రతి పరిచ్ఛేదము ఒక కొత్త వాక్యముతో మొదలవుతుంది కాబట్టి. |
కాలము/పరిచ్ఛేదము (Paragraph) | |
ఒకటి అంతకంటే ఎక్కువ వాక్యాలు కలిసిన రూపమే కాలము/పరిచ్ఛేదము (Paragraph). ఎలక్ట్రానిక్ పత్రాలు పరిచ్ఛేదాన్ని గుర్తించడానికి ఒక ప్రత్యేకమైన అదృశ్య గుర్తును వాడుతాయి. ఈ గుర్తు పరిచ్ఛేదము చివర వుంటుంది. దీనినే పరిచ్ఛేదాంత గుర్తు (Paragraph terminator) లేదా పరిచ్ఛేద గుర్తు (Paragraph Mark) అంటాము.
కంప్యూటర్‌కు సంబంధించినంతవరకు ఒక పరిచ్ఛేద గుర్తు (Paragraph Mark) ముందు కనపడే గుర్తులలో కనీసం ఒక్కటన్నా సదృశ్య గుర్తు వుంటే అది పరిచ్ఛేదమవుతుంది. ఊదా: కేవలం ఎడం కుంచికతో ఏర్పరచబడ్డ గుర్తులు అనేకం వుండి, చివర పరిచ్ఛేద గుర్తు వుంటే అది పరిచ్ఛేదం క్రింద గుర్తించబడదు. |
పంక్తులు » పదాలు పేర్చబడే/అమర్చబడే విధానం (Word Wrapping) | |
ఎలక్ట్రానిక్ పత్రాలలో ఒక పరిచ్ఛేద పాఠం ఒక విభాగంగా/యూనిట్‌గా పరిగణించబడుతుంది. ఒక పరిచ్ఛేదములోని సదృశ్య, అదృశ్య చిహ్నాలన్నీ కలిసి ఒక చిహ్నాల ప్రవాహంగా/మాలగా ఏర్పడతాయి. ఒక పరిచ్ఛేదములోని పదాలు ఎడం కమ్మి ఖాళీ, TAB గుర్తు ఖాళీ లేదా పంక్తి విరుపు ఖాళీతో విడదీయబడి వుంటాయి. ఒక పరిచ్ఛేదములోని అక్షర పాఠం ఒక పంక్తి/వరుసలో సరిపోకపోతే, అది స్వయంచాలకంగా (automatically) తరువాతి పంక్తి/వరుసలోకి పారుతుంది. ఒక పంక్తి చివర కొచ్చినప్పుడు పరిచ్ఛేదములోని మిగిలిన పాఠం తరువాతి పంక్తిలోకి స్వయంచాలకంగా పారడాన్ని వోర్డ్ వ్రాపింగ్ అంటారు.
ఒకటి అంతకంటే ఎక్కువ వరుసలు చేర్చగలిగే ఎలక్ట్రానిక్ పత్రాలలో పంక్తి/శ్రేణి అనే దానికి స్ధిరమైన పొడవు (Length) వుండదు. దీనికి కారణం పత్రంలో, ఒక అక్షరప్రదేశములో, పదాలు అమర్చబడే విధానం (Word wrapping). ఒక పరిచ్ఛేదములో వున్న పదాలన్నింటినీ ఒక పంక్తిలో/శ్రేణిలో పేర్చుతూ పోతున్నామనుకోండి. ఒక శ్రేణి వెడల్పు పత్రం వెడల్పులో నుండి Left, right margins తీసి వేసి నిర్ధారించవచ్చు. శ్రేణి చివరకు వచ్చేటప్పటికి యింకా పదాలు మిగిలి వుంటే ఏమి చేస్తాము? వాటిని తరువాతి శ్రేణిలో అమర్చడం మొదలు పెడతాము. కంప్యూటర్లో కూడా అదే జరుగుతుంది. అలా పదాలు మొత్తం పూర్తయ్యేవరకు ఎన్ని పంక్తులు/శ్రేణులు అవసరమైతే అన్ని శ్రేణులలో పదాలను కంప్యూటర్ పేర్చుతుంది. పంక్తి వెడల్పు స్ధిరంగా వుంటుంది అని చెప్పలేము. పంక్తి వెడల్పులో ఎప్పుడు మార్పు వచ్చినా ప్రోగ్రామ్ వున్న పరిచ్ఛేదములో పాఠాన్ని స్వయంచాలకంగా తిరిగి పేరుస్తుంది. ఒకవేళ మీరు పత్రం యొక్క వెడల్పును సరిచేస్తే, సరిచేయబడ్డ శ్రేణి వెడల్పును బట్టి, ఈ ప్రక్రియ మొత్తం మళ్ళీ చేపట్టి పరిచ్ఛేధంలోని మొత్తం పదాలను తిరిగి పేరుస్తుంది. వెబ్ పుటకి అసలు వెడల్పు అనే ఆలోచన నిర్ధారించబడి వుండదు. మీరు వెబ్ పుటలో అంతర్భాగమయిన పరిచ్ఛేదానికి లేదా అది కలిగివుండే అంశాలకు (డివిజన్, పట్టిక, గడి లాంటివి) వెడల్పును నిర్ధారిస్తే తప్పితే, ఒక పంక్తి వెడల్పు నిర్ధారించబడి వుండదు. ఒక వెబ్ పుట యొక్క వెడల్పు పుట ప్రదర్శించబడివున్న గవాక్షము (Window) యొక్క వెడల్పును బట్టి నిర్ధారించబడుతుంది. గవాక్షమును పెద్దది చేయడం, చిన్నది చేయడం లాంటివి చేసినప్పుడల్లా గవాక్షం వెడల్పుకనుగుణంగా, ఆ పుటలో వున్న పరిచ్ఛేద వెడల్పు మారుతూ వుంటుంది. తద్వారా పంక్తి వెడల్పు కూడా మారుతూవుంటుంది. పంక్తి వెడల్పు మారినప్పుడల్లా బ్రౌసర్ ప్రోగ్రామ్ ఆ పరిచ్ఛేదములోని పదాలను తిరిగి అమర్చుతుంది. దాన్ని బట్టి వెబ్ పుటలోని పరిచ్ఛేదములో వున్న పంక్తులు ఎన్ని అనేది బ్రౌసర్ గవాక్షము ఏ పరిమాణములో చూపబడుతుంది అనే దాని మీద ఆధారపడివుంది అని అర్ధం చేసుకోవాలి. ఒక పరిచ్ఛేదము ఎన్ని పంక్తులుగా ఏర్పడి వుంటుంది, ఆ పరిచ్ఛేదములో ఎన్ని వాక్యాలున్నాయి, అనేవి రెండు వేరు వేరు ఆలోచనలు. |
అక్షరక్రమ తనిఖీ » శబ్దకోశం | |
• అక్షరక్రమము (Spelling)
ఏ భాషలోనైనా, ఒక పదము ఒకటి అంతకంటే ఎక్కువ అక్షరాలతో ఏర్పడుతుంది. సాధారణంగా ఒక భాషకు సంబంధంగా వుండే అక్షరాలు/చిహ్నాలను వుపయోగించి కూర్చగలిగిన పద రూపాలన్నింటికీ భాషలో అర్ధాలు వుండవు. అర్ధము కలిగిన/నిర్వచించబడిన పదరూపాలనే మనము ఆ భాషలోని పదాలుగా పరిగణిస్తాము.
• శబ్ద కోశం (Dictionary)
మనం సాధారణంగా అర్ధం తెలుసుకోవడానికి వాడే దానిని (ఒక భాష లోని పదాలకు అర్దాలు కలిగి వున్న పుస్తకాన్ని) Dictionary (నిఘంటువు) అంటాము.
ఒక భాషకు సంబంధించిన అర్ధం నిర్వచించబడి వున్న పద రూపాలన్నింటినీ కలిగిన పుస్తకాన్ని శబ్ద కోశం (Word List) అంటారు. అయితే ఎలక్ట్రానిక్ పత్రాలలో అక్షర క్రమాన్ని తనిఖీ (Spelling check) చేయడానికి వుపయోగించే, అర్ధం నిర్వచించబడి వున్న పద రూపాలన్నింటినీ కలిగివున్న ఫైలును, Dictionary అంటారు. తేడా గమనించగలరు. శబ్ద కోశం కేవలం పదాలు కలిగిన ఫైలుగా అర్ధం చేసుకోవచ్చు. • శబ్ద కోశ ఫైలు » Dictionary File
శబ్ద కోశ (Dictionary) ఫైలు ఒక అక్షర రూప (Text) ఫైలు. ప్రతిపదం ఒక నిర్ధిష్టమైన వరుసలో వుంటుంది. వరుసలో పదమునకు సంబంధించిన అక్షరాలు తప్ప ఖాళీలు, ఏ యితర చిహ్నాలు వుండవు.
పదాలు పరిచ్ఛేదాంత చిహ్నాలతో విడగొట్టబడివుంటాయి. పదం చివర కర్సర్ వున్నప్పుడు ENTER కుంచిక నొక్కడం ద్వారా పదం చివర పరిచ్ఛేదాంత గుర్తు చేర్చబడి తదుపరి పదం చేర్చడానికి తదుపరి వరుస సృష్ఠించబడుతుంది.
• కంప్యూటర్ అక్షర క్రమ దోషాలను ఎలా గుర్తిస్తుంది?
పత్రంలో మనం చేర్చిన ఒక పదం (పద రూపం) పరిగణలోకి తీసుకుంటే అది సరియైన అక్షర క్రమం కలిగి వుందా లేదా అనేది, ఆ భాషలో అర్ధం నిర్వచించబడిన పదాలలో ఆ పదరూపం వుందా లేదా అనే దాన్ని బట్టి నిర్ధారించవచ్చు.
కంప్యూటర్ ప్రోగ్రాము ఒక పదం (అక్షర క్రమం) శబ్ద కోశ ఫైల్‌లో కనపడినట్లయితే అది సరి అయినదిగా భావిస్తుంది. లేనట్లయితే ఆ అక్షర క్రమము, దోషముగా గుర్తించబడుతుంది. |
పోస్ట్ పాఠం » అక్షర క్రమ తనిఖీ | |
బ్లాగర్ ప్రోగ్రామ్ కూడా ఆంగ్ల భాషలో వున్న అర్ధం నిర్వచించబడి వున్న పదములు (word list) కలిగిన ఒక శబ్ద కోశ ఫైలు కలిగివుంటుంది. మీరు బ్లాగర్ ప్రోగ్రామ్‌ను కూర్పులో వున్న పోస్టింగ్‌లో అక్షర క్రమ తనిఖీ చేపట్టమన్నప్పుడు బ్లాగర్ ప్రోగ్రామ్, అక్షర ప్రదేశములో వున్న పోస్ట్ ముఖ్య భాగానికి సంబంధించిన పదాలను తన వద్ద వున్న శబ్దకోశంతో పోల్చి అక్షర క్రమ దోషాలను గుర్తిస్తుంది.
• ఉపసంహరించడం (undo) తిరిగి చెయ్యడం (redo)
అక్షర క్రమ దోషాల సవరణ ఉపసంహరించడం కుదరదు. కాబట్టి ఉపసంహరించినవి తిరిగి చెయ్యడం అనే అవకాశం కూడా లేదు.
|
వెబ్ పుటలో వోర్డ్ వ్రాపింగ్ | |
వెబ్ పుట కూడా వోర్డ్ ప్రోసెసింగ్ డాక్యుమెంట్ లాంటిదే. అయితే వోర్డ్ ప్రోసెసింగ్ పత్రం లాగా ఒక వెబ్ పుటకు నిర్ధిష్టమైన వెడల్పు వుండదు. ఒక వెబ్ పుట యొక్క వెడల్పు షుమారుగా అది ప్రదర్శించబడే గవాక్షము యొక్క వెడల్పుగా పరిగణించవచ్చు. గవాక్షము వెడల్పు మార్చినప్పుడల్లా వెబ్ పుట యొక్క వెడల్పు మార్చినట్లే. పరిచ్ఛేదము వెబ్ పుటలోని ఒక అంశమవుతుంది. పరిచ్ఛేదము యొక్క వెడల్పు నిర్ధారించబడి వున్నప్పుడు, లేక పరిచ్ఛేదమును కలిగి వున్న వెబ్ పుట అంశము యొక్క వెడల్పు నిర్ధారించబడి వున్నప్పుడు తప్పితే, పరిచ్ఛేదము యొక్క వెడల్పు వెబ్ పుట యొక్క వెడల్పుతో సమానము. ఒక పరిచ్ఛేదము లోని పాఠం ఎన్ని పంక్తులలో పేర్చబడి వుంది (wrapped) అనే విషయం పరిచ్ఛేదము యొక్క వెడల్పు మీద ఆధారపడి వుంటుంది. పరిచ్ఛేద వెడల్పు గవాక్ష వెడల్పు మీద ఆధారపడి వుంటుంది. కాబట్టి గవాక్షము వెడల్పు మార్చినప్పుడల్లా ఒక పరిచ్ఛేదములోని పంక్తుల సంఖ్య మారుతూ వుంటుంది. ');
• వెబ్ పుటకు వెడల్పు అమర్చడం
వెబ్ పుటకు వెడల్పును స్ధిరంగా వుండేటట్లు పరోక్షంగా అమర్చవచ్చు. ఇది వెబ్ పుటలోని ఏదయినా అంశానికి (పట్టిక, విభాగము, అడ్డ గీత మొదలైనవి) స్థిరమైన వెడల్పును అమర్చడం ద్వారా చెయ్యవచ్చు.
వెడల్పును % పదాలలో కాకుండా నిర్ధిష్ఠమైన విలువగా నిర్వచించినట్లయితే, స్ధిరమైన వెడల్పు విలువ నిర్వచించినట్లు. ఈ అంశాల వెడల్పు విలువ % పదాలలో నిర్వచించినట్లయితే, బ్రౌసర్ ఆ విలువను గవాక్షము వెడల్పు ఆధారంగా, (బ్రౌసర్ వెడల్పులో అంత శాతంగా) లెక్కగడుతుంది. బ్రౌసర్ గవాక్షము వెడల్పు మార్చినప్పుడల్లా ఆ అంశం వెడల్పు మారుతుంది. స్థిర వెడల్పు విలువ కలిగివున్న అంశాలు కలిగి వున్నట్లయితే బ్రౌసర్ వెడల్పు ఆ వెడల్పుకు తగ్గకుండా వుంటుంది. తద్వారా పుట వెడల్పు కూడా మారకుండా వుంటుంది. బ్రౌసర్ వెడల్పు ఆ అంశం వెడల్పు మీద ఆధారపడి వున్నట్లు ఒక వేళ గవాక్షము వెడల్పును ఆ అంశానికి అమర్చబడ్డ వెడల్పు కంటే తక్కువకు తగ్గించినట్లయితే, గవాక్షానికి క్రింది భాగంలో అడ్డ జరుపు పట్టి (Horizontal scroll bar) ప్రదర్శంచబడుతుంది/జత చేయబడుతుంది. |
వెబ్ పుట పొడవు/ఎత్తు | |
వోర్డ్ ప్రోసెసింగ్ పత్రాలలో పుటకు ఎత్తు/పొడవు, వెడల్పు అమర్చబడి వుంటాయి. ఒక వెబ్ పుటకు మాత్రం పొడవు/ఎత్తు అనేవి స్ధిరంగా వుండే కొలతలు కాదు. ప్రతి HTML ఫైల్ ఒక వెబ్ పుట. ఒక వెబ్ పుట యొక్క ఎత్తు/పొడువు ఎంత అంటే, ఆ పుటలో వున్న పాఠం మొత్తం ప్రదర్శించడానికి గవాక్షం ఎత్తు పొడవు ఎంత అవసరమైతే అంత. వెబ్ పుట యొక్క వెడల్పు కూడా స్ధిర విలువ కలిగి వుండదు (ఆ వెడల్పును, ఆ పుటలోని ఏదయినా అంశానికి స్ధిరమైన వెడల్పును అమర్చడం ద్వారా పరోక్షంగా అమర్చినట్లయితే తప్పితే). గవాక్షము వెడల్పు మారిన కారణంగా వెబ్ పుట యొక్క వెడల్పు మారినట్లయితే, ఆ పుటలో వున్న మొత్తం పాఠాన్ని ప్రదర్శించడానికి అవసరమైన పుట పొడవు/ఎత్తు కూడా మారుతుంది. వెబ్ పుటలకు సంబంధించినంతవరకు పొడవు/ఎత్తు అనే ఆలోచన చేయం. |
అనువాదం :: నేర్పు జట్టు | ఈ పుటకు ఆంగ్ల మూలం | ... తరువాతి పుట ౧౧ (11) |